అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
నిరంతరం కొనసాగనున్న దరఖాస్తుల ప్రక్రియ
ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదు
చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామసభలో
కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. ప్రజా పాలన గ్రామసభ కార్యక్రమంలో భాగంగా గురువారం చివ్వెంల మండలం బండమీది చందుపట్ల గ్రామాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న గ్రామ సభలలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల పేర్లు వెల్లడిస్తున్నారని, ఆ వివరాలు ఫైనల్ కావని పేర్కొన్నారు. ప్రజాపాలనలో, మీసేవ ద్వారా, ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభలలో సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న ఆర్జిదారుల దరఖాస్తులు పరిశీలించి ఫైనల్ జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుత జరుగుతున్న గ్రామసభలలో సంక్షేమ పథకాల ముసాయిదా జాబితాలో తమ పేర్లు రాలేదని ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రస్తుతం గ్రామసభ పేర్లలో . రాష్ట్రంలో వివిధ రకాల సంక్షేమ పథకాల కోసం అర్హులైన లబ్ధిదారుల నుండి నిరంతరం దరఖాస్తు స్వీకరిస్తూనే ఉంటామని తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసే సమయంలో కొందరు ప్రజలు వారికి ఏ సంక్షేమ పథకం కావాలో దానికి టిక్ చేయ లేదని అయినప్పటికీ వారందరూ కూడా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన జాబితాను అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తారని తెలిపారు. సంక్షేమ పథకాలు అందించే విషయమై ప్రజలకు ఎటువంటి అనుమానాలు ఉన్న మండల కార్యాలయంలో, జిల్లా కార్యాలయాలలో అధికారులు పరిష్కరిస్తారని తెలిపారు. ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందజేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి విడతలవారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని అందేలా చర్యలు చేపడతామన్నారు. అనంతరం చందుపట్లలో కొందరు లబ్ధిదారులు సమస్యలు విని సమాధానాలు తెలిపారు. గ్రామానికి చెందిన ఒకరు తాను ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నానని తన పేరు జాబితాలో రాలేదని పేర్కొనగా ప్రస్తుతం జరుగుతున్న గ్రామసభలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలిపారు . చందుపట్ల (బి) గ్రామం తనకు ఇష్టమన్న కలెక్టర్, తాను వ్యక్తిగతంగా ఒకసారి గ్రామాన్ని సందర్శించినట్లు పేర్కొన్నారు. ఇక్కడ ప్రజలు చైతన్యవంతులని ఇక్కడ యువత చదువుతోపాటు వ్యాపార రంగాలలో ముందు ఉండడం అభినందనీయం అని పేర్కొన్నారు. చందుపట్ల గ్రామాన్ని సందర్శించడం సంతోషంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ సిహెచ్ కృష్ణయ్య, ఇతర టీం సభ్యులు పాల్గొన్నారు.