రాష్ట్రప్రభుత్వం వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి బండారు రాజా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తూ పెనుగొండ క్షేత్రంలోని శ్రీ వాసవి మాతకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం వాసవి మాత ఆత్మార్పణ చేసుకున్న రోజును అధికారికంగా నిర్వహించి ఆర్యవైశ్యులను గౌరవించాలన్నారు. త్వరలో జరగబోవు మున్సిపల్ గ్రామపంచాయతీ, జిల్లా పరిషత్తులో ఆర్యవైశ్యులకు ఎక్కువ స్థానాల కేటాయించాలని కోరారు.