కుల దురహంకారంతో బంటిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
కెవిపిఎస్,సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిలు కోట గోపి నెమ్మాది వెంకటేశ్వర్లు
సూర్యాపేట పట్టణం మామిళ్ల గడ్డలో నివాసముంటున్న మాల సామాజిక వర్గానికి చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ బంటి పిల్లల మర్రి కి చెందిన గౌడ సామాజిక వర్గానికి చెందిన భార్గవిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకోవడంతో ఓర్వలేక కుల దురహంకారంతో బంటీ ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఈరోజు బంటి భార్య భార్గవిని వారు నివాసం ఉండే పట్టణంలోని మామిల్లగడ్డలో పరామర్శించి ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులాలు వేరైనా కలిసి జీవించాలని, కుల అంతరాలు తొలగిపోవాలని,ప్రేమించి పెళ్లి చేసుకుంటే కులం పేరుతో ఇట్లాంటి హత్యలకు పాల్పడడం దుర్మార్గం అన్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న బంటి భార్గవిలపై కక్ష పెంచుకున్న భార్గవి నాయనమ్మ,అన్నలు కక్షపూరితంగానే తక్కువ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుందని కుట్ర చేసి బైరు మహేష్ కు సుఫారి ఇచ్చి పిలిపించి హత్యకు పాల్పడ్డారని అన్నారు. బంటిని హత్య చేశాక వారు పైశాచిక ఆనందం పొందుతూ కోట్ల నవీన్,కృష్ణ మరియు హత్యకు పాల్పడిన మరికొంతమంది కలిసి పాత సూర్యాపేటలో ఉన్న నాయనమ్మకు మృతదేహాన్ని చూపించి వారి క్రూరత్వాన్ని నిరూపించుకున్నారని అన్నారు. గతంలో మిర్యాలగూడలో ప్రణయ్, నేడు సూర్యాపేటలో బంటి ఈ రకంగా కుల దురాహంకార హత్యలకు గురయ్యారని తెలిపారు. కుల దురహంకార హత్యకు గురైన బంటి భార్య భార్గవికి వారి కుటుంబ సభ్యులకు పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ జరిపి మూడు నెలల్లో దోషులకు శిక్ష పడే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో తన పని తాను చేసుకుంటూ భార్గవిని ఇష్టంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఓర్వలేక కులపిచ్చి తో హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ హత్యలో భార్గవి కుటుంబ సభ్యులే కాకుండా మరికొందరి ప్రమేయం కూడా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు సమగ్ర విచారణ జరిపి దోషులకు కఠినమైన శిక్షలు విధించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కులం పేరుతో జరిగిన హత్యలను రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరు ఖండించాలని పిలుపునిచ్చారు బంటి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ కెవిపిఎస్ ఆధ్వర్యంలో అన్ని దళిత సామాజిక ప్రజా సంఘాలను కలుపుకొని ఐక్యంగా పోరాటాలు ఉధృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు మర్రి నాగేశ్వరరావు జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి వీరబోయిన రవి కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి టేకుల సుధాకర్ కెవిపిఎస్ జిల్లా నాయకులు శ్రీరాములు, నందిపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.