కోట్లు పెట్టి కొన్నారు.. ఇప్పుడు ఆ విల్లాల పరిస్థితి ఏంటంటే..?

కోట్లు పెట్టి కొన్నారు.. ఇప్పుడు ఆ విల్లాల పరిస్థితి ఏంటంటే..?

హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

‘కోట్లు పెట్టి పెద్ద ఇల్లు కట్టకున్నా.. ఎలాంటి ఇబ్బందులు లేని ఓ చిన్న గుడిసె నిర్మించుకున్నా చాలు’ అని అంటుంటారు. సరిగ్గా అదే నిజమైంది ఇప్పుడు. హైదరాబాద్ శివారులో కోట్లు పెట్టి విల్లాలు కొన్నారు పలువురు పెద్దలు. ఇప్పుడు ఆ విల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. చుట్టుముట్టిన వరదతో ప్రజలు ఎటూ వెళ్లలేని పరిస్థితి వచ్చింది. నీటిలోనే అవస్థలు పడుతున్నారు. ‘ఇన్ని కోట్లు పెడితే.. ఇదేం ఖర్మరా బాబూ’ అంటూ తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జోరు వానలు పడుతున్నాయి. వరదలతో చాలా వరకు గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. ఇక మహానగరం హైదరాబాద్ కూడా తడిసిముద్దయింది. చాలా వరకు కాలనీలో నీట మునిగాయి. ప్రధాన రోడ్లపై నీరు ఏరులైపారుతోంది. చుట్టుపక్కల చెరువులు అలుగు పారుతున్నాయి. ఇప్పటికే స్కూళ్లకు సెలవులు ప్రకటించగా.. ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.

అయితే.. ఈ వరదల్లో ఖరీదైన విల్లాలు సైతం చిక్కుకున్నాయి. కళ్లు జిగేల్ మనేలా నిర్మించిన విల్లాలు ఇప్పుడు నీటితో నిండిపోయాయి. వరదలో విషసర్పాలు సైతం కొట్టుకువస్తుండడంతో ప్రజలు భయపడుతూ కాలం వెల్లదీస్తున్నారు. అంత ఖరీదు పెట్టి కొన్న ఆ విల్లాలకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది..? వందలాది విల్లాలు ఇప్పుడు ఎందుకు విలవిల్లాడుతున్నాయి..?

హైదరాబాద్ నగర శివారులోని ఖరీదైన ప్రాంతంలో ఓ వెంచర్‌లో 212 విల్లాలు నిర్మించారు. ఒక్కో విల్లా విలువ సుమారు రూ.6 కోట్లు. చూడ్డానికి అద్భుతంగా నిర్మించినా ఇప్పుడు వాటి చుట్టూ నీరు చేరింది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు సైతం నీట మునిగాయి. 24 గంటలుగా అటు కార్పొరేషన్ అధికారులు.. ఇటు స్థానికులు ఆ నీటిని తొలగించేందుకు వ్యయప్రయాసాలు పడుతున్నారు. కానీ.. అక్కడి పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మోటార్లు పెట్టి నీళ్లు తోడుతున్నా.. అటు వర్షం కురుస్తుండడం ఇటు వరద వస్తుండడంతో నీరు తగ్గడం లేదు.

అయితే.. ఈ దుస్థితి కారణం డ్రైనేజీ వ్యవస్థనే. కోట్ల రూపాయలతో విల్లాలు నిర్మించిన వారు డ్రైనేజీ వ్యవస్థను సరిగా ఏర్పాటు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి. డ్రైనేజీ వ్యవస్థను ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఇప్పుడు ఇలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని స్వయంగా అధికారులే చెబుతున్నారు. కోట్లు పెట్టి ఇల్లు, విల్లాలు కొనే ముందు ప్రజలు సైతం అక్కడి సౌకర్యాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఘటనను చూస్తుంటే మరోసారి రుజువైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment