సంచలన నిర్ణయం…హైడ్రా పేరిట కొత్త చట్టం..!
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
హైడ్రా సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీను మరింత బలోపేతం చేయనున్నారు. ఈ మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. హైడ్రా పేరిట ప్రత్యేక చట్టం రూపొందించనున్నట్లు కమిషనర్ వెల్లడించారు. దీనికి సంబంధించిన నియమ, నిబంధనలు, విధి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు.
ప్రత్యేక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తామని కమిషనర్ చెప్పారు. ప్రస్తుతం ఆయా స్థానిక సంస్థలు చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన భవన నిర్మాణదారులకు నోటీసులు ఇస్తున్నామన్నారు. వీటి ఆధారంగా తనిఖీలు చేసి కూల్చేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. అదే విధంగా హైడ్రా పేరిట పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
హైడ్రా చట్టం అమల్లోకి వస్తే.. ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలిస్తుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అనుమతులు, వివిధ అభ్యంతర పత్రాల విషయంలో పోలీస్ స్టేషన్ విచారిస్తుందన్నారు. ప్రస్తుతం తమ విచారణలో అవినీతి చేసిన అధికారుల వివరాలు ఉన్నాయని, త్వరలోనే అవినీతి అధికారులపై కేసులు నమోదు చేస్తామన్నారు.
హైడ్రాలో పలు విభాగాలను సైతం ఏర్పాటు చేస్తామని కమిషనర్ వివరించారు. చెరువుల సంరక్షణ, విపత్తుల నిర్వహణ, క్రీడా మైదానాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ వంటివి అందులో ఉంటాయన్నారు. ఇటీవల కొన్ని ఫిర్యాదులు వచ్చాయన్నారు. చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు, పరిశ్రమలు వంటి కట్టడాలపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉందని కమిషనర్ వివరించారు. ఇటీవల జన్వాడ ఫాంహౌస్ గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. మాజీ మంత్రి ఫాంహౌస్ కూల్చేందుకు హైడ్రా సిద్దమైందనే ప్రచారంలో వాస్తవం లేదని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకే ఉందని చెప్పారు. అయితే ప్రభుత్వం లేదా అక్కడ ఉన్న స్థానిక సంస్థలు హైడ్రాను సంప్రదిస్తే..యంత్ర సామాగ్రిని సాయంగా అందజేస్తామని వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏ ప్రాంతంలోనైనా అక్రమ నిర్మాణాలు నిర్మించారని ఆ స్థానిక సంస్థ కోరినా, ఎక్కడైనా అక్రమంగా కట్టిన నిర్మాణాల కూల్చివేతలకు చట్టం ఒకటేనని కమిషనర్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన పలు తీర్పులను ఆయన గుర్తు చేశారు. చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాల కట్టడాలను నోటీసులు ఇవ్వకుండా కూల్చేయవచ్చని పేర్కొందన్నారు. అలాగే జీహెచ్ఎంసీ చట్టంలోని 405 సెక్షన్ ప్రకారం.. రోడ్డు వంటి ఆక్రమణలకు సైతం నోటీసులు ఇవ్వకుండా కూల్చేయవచ్చన్నారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏర్పాటు అయిన సంస్థలకు చట్టబద్ధత ఉంటుంది. ఇందులో భాగంగా విజిలెన్స్, ఏసీబీ, ప్లానింగ్, లా కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయన్నారు. నాలాలు, రోడ్ల ఆక్రమణలకు సంబంధించిన నిర్మాణాల కూల్చివేతకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. అయినా ఎన్ కన్వెన్షన్, ఇతర కట్టడాలకు ముందే నోటీసులు ఇచ్చామన్నారు. త్వరలోనే చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ను సామాన్యులకు సైతం అర్థమయ్యేలా యాప్ తీసుకొస్తామని, దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.