నేడు హైదరాబాద్ రానున్న కవిత – గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు క్యాడర్ సిద్ధం.
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
ఢిల్లీ లిక్కర్ కేసులో (బుధవారం) విచారణకు హాజరుకానున్నారు.ఎమ్మెల్సీ కవిత. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ట్రయల్స్‌లో భాగంగా ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో నిన్న మంగళవారం తీహార్ జైలు నుంచి విడుదలైన కేసీఆర్ తనయ వసంత్ విహార్‌లోని పార్టీ కార్యాలయంలో బస చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ పూర్తికాగానే మధ్యాహ్నం 2.40 గంటలకు తన కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్ బయల్దేరి వెళ్తారు.
500 కార్లతో భారీ ర్యాలీ……!
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో తీహార్ జైలుకెళ్లిన కవిత.. దాదాపు 166 రోజుల తర్వాత బెయిల్ ద్వారా నిన్న మంగళవారం బయటకొచ్చారు. ఆమె సోదరుడు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత విడుదల కోసం ఏర్పాట్లు చేసేందుకు ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు. ఆమె విడుదల కాగానే పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. కవిత హైదరాబాద్ వస్తున్న సందర్భంగా పార్టీ శ్రేణనులు బుధవారం 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు.
కేసీఆర్ బిడ్డను ఏ తప్పూ చేయలేదు…!
జైలు నుంచి విడుదలైన కవిత తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ `నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. ఏ తప్పూ చేయకున్నా నన్ను జైలుకు పంపారు. నేను మంచి దాన్ని. నేను మొండి దాన్ని. జైలుకు పంపి నన్నింకా జగమొండిని చేశారు. తెలంగాణ కోసం పోరాడతా.. తెలంగాణ కొట్లాడతా.. ఏ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేద`ని ఆమె భావోద్వేగంతో విడుదలైన అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో బహిరంగంగా మాట్లాడారు. కవిత విడుదల కోసం నిరీక్షించిన పార్టీ శ్రేణులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిందన్న వార్త తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తూ పండగ చేసుకున్నారు.
వడ్డీతో సహా చెల్లిస్తాం..
ఐదున్నర నెలల తర్వాత కుటుంబాన్ని,మీడియాను కలవడం చాలా సంతోషంగా ఉందని కవిత అన్నారు. ఒక తల్లిగా ఇంతకాలం పిల్లల్ని వదిలేసి ఏనాడూ దూరంగా ఉండలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా, ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎవరి గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లించి తీరుతామన్నారను. సరైన సమయంలో సరైన సమాధానం చెప్పకుండా వదిలే ప్రసక్తే లేదన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు, తన రాకకోసం వచ్చిన పార్టీ నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.