కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి..
ఉదయం 11 గంటలకు ఖైరతాబాద్ గణనాధుడికి తొలి పూజ
తొలిపూజలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
మధ్యాహ్నం పూజలో పాల్గొననున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
నేటి నుండి హైదరాబాదులోని ఖైరతాబాద్ మహా గణపతికి పూజలు ప్రారంభం కానున్నాయి. అనవాయతీ ప్రకారం ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీ సంఘీయులు ఊరేగింపుగా మండపం వద్దకు చేరుకుని ఖైరతాబాద్ గణనాధుడికి చేనేత నూలు కండువా గాయత్రి సమర్పించారు. ఖైరతాబాద్ లో గణేశ్ వేడుకలను ప్రారంభించి 70 ఏళ్లు అయిన సందర్భంగా ఈ సారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్దం చేశారు.7 అంకెకు ప్రాధాన్యమిస్తూ 7 తలలు, 7 సర్పాలు. రెండు వైపులా 7 చొప్పున మొత్తం 14 చేతులతో ఇక్కడి విఘ్నేశ్వరుడు కొలువుదీరాడు.ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 28 అడుగుల వెడల్పుతో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకోనున్నాడు. ఈ నెల 17న ఘనంగా నిమజ్జన వేడుక జరగనుంది. ఉదయం 11 గంటలకు వినాయకుడికి తొలి పూజ జరగనుంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా విచ్చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పూజలో పాల్గొననున్నారు