కరీంనగర్ లోని కోతిరాంపూర్ కు చెందిన డాక్టర్ పురంశెట్టి లావణ్య అగ్రికల్చర్ రీసర్చ్ సర్వీసెస్ లో శాస్త్రవేత్తగా ఎంపికైంది. ఇటీవల అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఏఎస్ఆర్బీ) విడుదల చేసిన ఫలితాల్లో లావణ్య తన విభాగంలో ఆల్ ఇండియా మూడో ర్యాంకు సాధించి సైంటిస్ట్ కావాలనే తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. లావణ్య ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో బీటెక్ పూర్తి చేసింది. ఆచార్య ఎన్టీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయంలో ఎంటెక్ పూర్తి చేసింది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (సీఐఏఇ) భోపాల్ లో తన పీహెచ్డి పరిశోధన ముగించి ఇండియన్ అగ్రికల్చర్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) నుంచి డాక్టరేట్ పట్టా పొందింది. ఈ సందర్భంగా లావణ్య శాస్త్రవేత్త ఎంపికపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా తల్లిదండ్రులు, అత్తమామలు, భర్త వెంకటేష్ ల ప్రోత్సాహంతోనే ఇది సాధించగలిగానని లావణ్య పేర్కొంది.
అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ శాస్త్రవేత్తగా లావణ్య
Published On: December 25, 2024 7:18 pm