ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు.. ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు.
♦️మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విధివిధానాలు, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై సీఎం గారు ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించి పలు సూచనలు చేశారు.
♦️తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్న కారణంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయాలి.
♦️అందుకోసం అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఇందిరమ్మ యాప్‌లో ఎలాంటి లోపాలు, లోటుపాట్లు లేకుండా చూడాలి.
♦️ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలి.
♦️లబ్దిదారులు ఎవరైనా ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకోవాలని ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలి.
♦️ఈ పథకం సమర్థవంతంగా కొనసాగించడానికి గృహ నిర్మాణ శాఖలో అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలి.