ఎస్బీఐకి రూ.175 కోట్లు టోకరా..!
సైబర్ క్రైం నేరగాళ్ల చేతివాటం..
-సహకరించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ చేసిన సీఎస్‌బీ.
హైదరాబాద్ (చార్మినార్ ఎక్స్ ప్రెస్ l)
రాష్ట్రంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పాతబస్తీ బ్రాంచ్ నుంచి ఏకంగా రూ.175 కోట్లను సైబర్ నేరస్తులు స్వాహా చేశారు. ఇందుకు కమీషన్లు తీసుకొని సహకరించిన హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు నేరస్తులను రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘరానా మోసానికి పాల్పడిన అసలు నిందితుల కోసం దర్యాప్తు సాగిస్తున్నామని సీఎస్‌బీ డైరెక్టర్‌తో పాటు రాష్ట్ర సీఐడీ డీజీపీ శికా గోయెల్ తెలిపారు. ఆమె వివరాల ప్రకారం.. పాతనగరంలోని షంషీర్‌గంజ్‌లో గల ఎస్బీఐ బ్రాంచ్‌లో నెల క్రితం విజయనగర కాలనీకి చెందిన షోయెబ్ తాఖీర్, మొఘల్‌పురాకు చెందిన మహ్మద్ బాజీర్‌లు కలిసి ఆరు ఖాతాలను తెరిచారు. వృత్తిరీత్యా ఆటో డ్రైవర్లు అయిన ఈ ఇద్దరు కూడా తమకు మధ్యవర్తులుగా వ్యవహరించిన సైబర్ నేరస్తుల సూచన మేరకు ఈ అకౌంట్లను ఆరుగురు వ్యక్తుల ద్వారా తెరిపించారు. వారంతా కూడా చిన్న జీతగాళ్లే. అనంతరం, సైబర్ నేరస్థుల సూచనల మేరకు ఈ ఆరు అకౌంట్లకు చెందిన ఖాతా నెంబర్లు, అవసరమైన పాస్‌బుక్‌ల జిరాక్స్‌లను పంపించారు. ఈ అకౌంట్ల సాయంతో గత 30 రోజుల్లో రూ.175 కోట్లను దారి మళ్లించారు.
ఈ విషయమై సమాచారమందుకున్న సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు దర్యాప్తును ప్రారంభించగా.. ఈ ఆసక్తికరమైన అంశాలన్నీ బయటపడ్డాయి. ఇండోనేషియా, కంబోడియా, దుబారు కేంద్రాలుగా పని చేస్తున్న సైబర్ నేరస్థులు ఈ భారీ మోసానికి పాల్పడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో షంషీర్‌గంజ్ ఎస్బీఐ బ్రాంచ్‌లో ఆరు అకౌంట్లు తెరవటానికి కారకులైన సోయెబ్ తాఖీర్, మహ్మద్ బాజీర్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి అకౌంట్లు తెరవటానికి సూత్రదారులు ఎవరు? అనేది తేల్చి, వారిని పట్టుకోవటానికి దర్యాప్తును ముమ్మరం చేశామని షికా గోయెల్ తెలిపారు. ఈ ఖాతాలను తెరవటానికి గానూ వీరికి కమీషన్లను కూడా సైబర్ నేరస్తులు చెల్లించారనీ, దానికి ఆశపడే ఈ నేరానికి వారు పాల్పడ్డారని ఆమె చెప్పారు. కాగా, ఈ డబ్బంతా కూడా క్రిప్టో కరెన్సీ రూపంలో తరలిపోయినట్టు తాము గుర్తించామని ఆమె తెలిపారు.