జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి వినేశ్ ఫొగాట్
పార్టీలో చేరిన రోజే టికెట్ ఖరారు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం
హర్యానా(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజే ఆ పార్టీ నుంచి కీలక ప్రకటన వెల్లడయింది. హర్యానాలోని జులానా అసెంబ్లీ స్థానం నుంచి ఆమెను పోటీకి దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాలో వినేశ్ ఫొగాట్ పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇదే సమయంలో మరో రెజ్లర్ బజరంగ్ పునియాకు కాంగ్రెస్ పార్టీ కీలక పదవిని కట్టబెట్టింది. ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పజెప్పింది.
భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియాలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వీరు ముందుగా భారత రైల్వేలో తాము చేస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఆ తర్వాత ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సీనియర్ నేతల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకు ముందు వీరు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మరో పక్క వీరు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అధికార బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.