సింగరేణి లో అమరవీరుల దినోత్సవం
రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల జి.యం. కార్యాలయ ఆవరణలో గురువారం అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన ఉద్యోగులు, అధికారులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు మాట్లాడుతూ, భరతమాత విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రాణత్యాగం చేసిన ఎంతో మంది త్యాగమూర్తులు, మహానుభావులు, సమరయోధులను స్మరించుకుంటూ జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి రోజున అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు.
మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యం ప్రసాదించడానికి వారు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. కావున స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా, ఐకమత్యంగా ఉంటూ, సమాజ హితం కోసం పాటుపడాలని కోరారు. లేదంటే మళ్లీ పూర్వపు స్థితికి వెళ్లే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలను మన భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు సంతోష్, కోట రవీందర్ రెడ్డి, ఏరియా ఇంజనీర్ వై.వి.శేఖరబాబు, వివిధ విభాగాధిపతులు చంద్రశేఖర్, రాజారెడ్డి, రాజేంద్ర కుమార్, నాగేశ్వరరావు, సుధాకర్, ఐలయ్య, గుర్రం శ్రీహరి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.