క్యాబినెట్ మంత్రుల పూటకొక ప్రకటన వల్ల రైతుల్లో ఆందోళన..
– షరతులు లేకుండా అర్హులైన ప్రతి రైతుకి రుణమాఫీ చేయాలి.
-తెలంగాణ రైతు సంఘం బయ్యారం మండలం కమిటీ.
బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
బయ్యారం మండల కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీని ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని 2015 నుండి ప్రభుత్వం ప్రకటించిన 2023 వరకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నంబూరు మధు మండల కార్యదర్శి మక్కెన తిరుపతిరావు మాట్లాడుతూ…
సాధారణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించింది.కాగ దశలవారీగా రుణాలు మాఫీ చేస్తూ తుది దశలో పూర్తిస్థాయిలో అర్హత కలిగిన రైతులకు రుణాలు మాఫీ కాలేదని రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు పూటకొక ప్రకటన చేస్తూ రైతులను గందరగోళ పరిస్థితులకు నెట్టేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.మండలంలో అర్హులైన రైతులకు 100 శాతంలో 60 శాతం మందికి మాత్రమే మాఫీ అయ్యాయని, మిగతా రైతులకు కొత్త కొత్త ఆంక్షలు, నిబంధనలను పెట్టి మాఫీ జరగకుండా చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు.
రైతాంగంలో కొంతమందికి పట్టాలు కాలేదని అప్పుడున్న పరిస్థితులలో పహాని మీద రుణాలు ఇచ్చారని అలాంటి రుణాలు మాఫీకి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. బ్యాంకులలో రెండు లక్షల కంటే అసలు వడ్డీ కలిపి దాటితే వడ్డీ కడితేనే రుణమాఫీ వర్తిస్తుందని అనడంతో రైతుల్లో ఆందోళన పెరిగిందని అన్నారు. ఇలాంటి పరిస్థితులలో రైతులు తమ రుణాలు మాఫీ అవుతాయో లేదో అని ఆవేదనలో ఉన్నారని ఇందులో రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు అనే షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కొత్త రుణాలు పెట్టుబడి ఖర్చు పెరిగినందున పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ముఖ్య నాయకులు మండల రైతులు పాల్గొన్నారు.