పకడ్బందీగా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలి
మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణ
ఇంటర్ పరీక్షల కోసం 23 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండాలి
పరీక్షా సమయానుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలి
ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షించిన అదనపు కలెక్టర్ డి. వేణు
జిల్లాలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డి.వేణు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం అదనపు కలెక్టర్ డి. వేణు సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ఇంటర్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ.. మార్చి 5 నుంచి మార్చి 25 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం అవసరమైన మేర పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసినట్లు, ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం 23 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 33 పరీక్ష కేంద్రాలలో జరిగే విధంగా ఏర్పాట్లు జరిగాయని తెలిపారు.
పబ్లిక్ పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని,పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్స్ లో త్రాగు నీరు అందించాలని, అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం రవాణా కోసం పరీక్షకు సకాలంలో హాజరయ్యే విధంగా అనుకూలంగా ఆర్టీసీ బస్సులు నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని తెలిపారు. పరీక్ష కేంద్రంలో సిసి టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పరీక్షా ప్రశ్న పత్రాల లీకేజీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చీఫ్ సూపరిండెంట్ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల సమక్షంలో ప్రశ్నపత్రాల కవర్ సీళ్లు ఓపెన్ చేయాలని, ఆ సమయంలో అధికారులు సెల్ ఫోన్ తీసుకు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు, కనీస మందులతో పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో పారిశుద్ధ్య నిర్వహణ స్థానిక సంస్థలు పర్యవేక్షించాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన , జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, , ఆర్టిసి, విద్యుత్, పంచాయతీ, మునిసిపల్, పోస్టల్, ట్రెజరీ, సంబంధిత ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.