ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేయడం సంతోషంగా వుంది
సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు
మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ
మున్సిపల్ చైర్మన్ గా ఐదేళ్ల పాటు ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషంగా వుందని సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు.
ఆదివారం నాడు సూర్యాపేట మున్సిపల్ కార్యాలయం నందు జరిగిన గణతంత్ర వేడుకలలో కమీషనర్ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మాట్లాడుతూ తన ఐదేళ్ల పదవి కాలంలో సూర్యాపేట పట్టణ అభివృద్ధి కి నిరంతరం కృషి చేశానని అన్నారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి సహకారంతో సూర్యాపేట పట్టణ సమగ్ర అభివృద్ధి కి నిధులు తీసుకుని వచ్చి పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని అన్నారు. ఐదేళ్లపాటు ప్రజలకు సేవలు అందజేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ప్రతి వార్డులో సిసి రోడ్ల నిర్మాణంతో పాటు పలుచోట్ల పార్క్ లు, ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం, మెయిన్ రోడ్ నిర్మాణం చేయడం జరిగిందని అన్నారు.
తాము అధికారం చేపట్టిన తరువాత కరోనా వంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు మున్సిపాలిటీ కార్మికులు అసాధారణ సేవలను అందించారని, వారికి ధన్యవాదములు తెలిపారు. పారిశుధ్య కార్మికులు నిరంతరం పనిచేయడం ద్వారానే పట్టణం పరిశుభ్రంగా వుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దోసపాటి గోపాల్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, ఫ్లోర్ లీడర్ లయ కాంగ్రెస్ పార్టీ కక్కిరేణి శ్రీనివాస్, బిజెపి పల్స మహాలక్ష్మి, కౌన్సిలర్ లు, కో ఆప్షన్ సభ్యులు , మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.