నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పుస్తకాలు పంపిణీ చేసిన ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్
సుభాష్ చంద్రబోస్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని గచ్చిబౌలి డివిజన్ పరిధిలో గల భవిత సెంటర్ నందు (తహసీల్దార్ కార్యాలయము సమీపమున) ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్ర పటానికి పుష్పంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. తదనంతరం విద్యార్థిని, విద్యార్థులకు నాటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బర్ లు, పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మన భారతదేశ చరిత్ర పుటలలో కీర్తి కిరీటాలుగా నిలిచి పోయిన కొద్ది మంది నేతలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రముఖుడు. ఆయన 1897 సంవత్సరములో జనవరి 23వ తేదీన ఒరిస్సాలోని కటక్ పట్టణంలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. నేతాజీ చురుకైన, తెలివైన విద్యార్థి. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఐసీఎస్ 4వ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. బ్రిటీష్ ప్రభుత్వంలో వారి అదుపాజ్ఞలలో పనిచేయటం ఇష్టం లేక లండన్ లో ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగివచ్చి గాంధీ గారి నాయకత్వంలో స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ మొదలైన నాయకులందరూ అహింసా వాదంతో స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే, బోసు మాత్రము సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను తరిమి కొట్ట వచ్చునని నమ్మి ఆచరణలో పెట్టినటపవంటి వాడు. భరతమాత దాస్య శృంఖలలో మ్రగ్గుతున్న భారతీయులకు అభయహస్తం అందించి నూతన ఉత్తేజాన్ని నింపి జాతీయ ఉద్యమం వైపు ప్రజలను ఆకర్షితులను చేసి బ్రిటిష్ వారికి సింహ స్వప్నం అయినారు. సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గాంధీజీ నేతాజీ ని కలకత్తా నగరానికి పంపడం జరిగింది. అక్కడ దేశబంధు చిత్తరంజన్ దాస్ తో కలిసి స్వాతంత్ర్య సంగ్రామంలో చురుకైన పాత్ర పోషించడం జరిగింది. ఆయన జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా, బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. రెండు పర్యాయాలు ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డారు. ఆయన స్వాతంత్రోద్యమంలో 11 సార్లు జైలుశిక్ష అనుభవించారు. కలకత్తా నగర సీఈఓ గా, మేయరుగా, పత్రికా సంపాదకులుగా పనిచేయడం జరిగింది. ‘నాకు రక్తం ఇవ్వండి – నేను స్వాతంత్ర్యం ఇస్తాను’ అని నినదించి ప్రజలలో జాతీయవాదం పెంపొందించారు. ఆయన గాంధీ సిద్ధాంతాలతో విభేదించి ‘ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్’ అనే రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. ‘ఆజాద్ హింద్ ఫౌజు’ను స్థాపించి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేయడం జరిగింది. ఈ ఆజాద్ హింద్ ఫౌజును అగ్ర రాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా, రష్యా మొదలైన దేశాలు గుర్తించడం జరిగింది. 1945 ఆగష్టు 18న తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో ఆయన పరమపదించారు. ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడు. దేశభక్తి పరాయణుడు. గొప్ప జాతీయవాది. జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ. జై హింద్ నినాదాన్ని అందించినవాడు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, దురాచారాలు, అసాంఘిక కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడాలి”* అని కోరారు. ఈ కార్యక్రమంలో భవిత సెంటర్ అధ్యాపకురాళ్ళు వెంకటరమణమ్మ, అబీదా మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఉమా చంద్రశేఖర్, వాణి సాంబశివరావు, పాలం శ్రీను, కృష్ణ, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.