లింగమంతుల జాతర ఏర్పాట్ల పరిశీలన
టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
తెలంగాణ లో రెండవ అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతరకు ప్రభుత్వ పరంగా అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. పెద్ద గట్టు ఆలయానికి చైర్మన్ ను త్వరలోనే నియమిస్తామని చెప్పారు. పిబ్రవరి నెల 16 వ తేది నుండి 20 వ వరకు జరిగే లింగమంతుల స్వామి జాతరకు పెద్దసంఖ్యలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన పెద్దగుట్ట ఆలయాన్ని సందర్శించి, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుట్టపై పరిసరాలలో జాతర సందర్భంగా చేయవలసిన ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఎస్పి ఇప్పటికే జాతర జరిగే ఆలయాన్ని సందర్శించారని, పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా తాను గుట్ట అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే జాతరకు చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డి తో మాడ్లాడినట్లు చెప్పారు. గతంలో బిఆర్ ఎస్ పాలనలో గుట్ట వద్ద జాతర సమయంలో నిధులు మంజూరు చేసి, హడావుడిగా కొన్ని పనులు చేసి బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ నిధులు స్వాహా చేశారని అన్నారు. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పారు. తాము గుట్ట వద్ద శాశ్వత నిర్మాణాలు చేస్తామని తెలిపారు. గుట్ట పైన భక్తులు రాత్రి పూట నిద్ర చేయడానికి కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేస్తామని చెప్పారు.
దేవాలయం పైన పూజారులు నివాసం వుండెలా రెసిడెన్షియల్ క్వార్టర్ల నిర్మాణం చేస్తామని, భక్తులకు మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రామ్మూర్తి యాదవ్, కౌన్సిలర్ షఫి వుల్లా, ముదిరెడ్డి రమణారెడ్డి, జ్యోతి కరుణాకర్, గట్టు శ్రీనివాస్, ఫరూక్, రమేష్ నాయుడు, ధర్మా నాయక్, బైరబోయిన శ్రీనివాస్, సైదిరెడ్డి, వల్దాసు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.