కేరళ ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకోండి
సిపిఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ
భద్రాచలం:కేరళ ప్రకృతి విపత్తు బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కల్లూరి వెంకటేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేరళ రాష్ట్రంలోని వాయినాడు జిల్లాలో ప్రకృతి విపత్తు సర్వం తుడిచిపెట్టిన విషయం తెలిసిందే.ఆ బాధితులను ఆదుకునేందుకు సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కల్లూరి తో పాటు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రావులపల్లి రవికుమార్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తు కారణంగా
వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని వేలాదిమంది నిరాశ్రయులయ్యారని చెప్పారు. తమ వారు నీటి సుడుల్లో కొట్టుకొని పోతుంటే కొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని దిక్కుతోచని స్థితిలో చూస్తూ ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తు వల్ల ఆ ప్రాంతాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని కనీస ఆనవాళ్లు కూడా లేవని చెప్పారు. ఈ విపత్తు పట్ల యావత్ భారతదేశం తో పాటు ఇతర దేశాలు కూడా స్పందిస్తూ మానవతా దృక్పథంతో ఎవరికి తోచిన సహాయాన్ని వారు అందిస్తున్నారని, ఇందులో భాగంగా సిపిఐ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. దాతలు ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకునేందుకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కరెడ్ల సురేష్ నాయుడు, సాధన పల్లి సతీష్, కృష్ణయ్య, మనసే, సీతారామరాజు, అశోక్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.