వ్యాసరచన పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు

వ్యాసరచన పోటీల్లో రాష్ట్రస్థాయికి ఎంపికైన ఉప్పరపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు

*విద్యార్థులు సాత్విక, అక్షిత గైడ్ టీచర్లు పిన్నింటి బాలాజీ రావు, జి. సుందర్ లను అభినందించిన వరంగల్ జిల్లా డిఈఓ జ్ఞానేశ్వర్*

వారధి ఫౌండేషన్ మరియు విద్యాశాఖ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా స్థాయి వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలను ఈరోజు శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు
ఏ. సాత్విక, డి. అక్షిత వరంగల్ జిల్లా స్థాయి వ్యాసరచన పోటీలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరికి గైడ్ టీచర్లుగా సైన్స్ ఉపాధ్యాయులు పిన్నింటి బాలాజీ రావు, జి సుందర్ వ్యవహరించారు. వీరిని డి ఈ ఓ అభినందించి సర్టిఫికెట్ తో సత్కరించారు.
విద్యార్థులు గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, పోటీలలో పాల్గొంటేనే విజయాలకు దారి దొరుకుతుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు పాఠ్యేతర కార్యక్రమాలలో కూడా చురుగ్గా పాల్గొనాలని, అందుకు ఉపాధ్యాయులంతా సహకరించాలని, పోటీ ప్రపంచంలో తగిన సామర్ధ్యాలను పెంపొందించుకోవాలని డీఈఓ జ్ఞానేశ్వర్ కోరారు.
వరంగల్ జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారని, మట్టిలో మాణిక్యాలుగా వెలుగొందు తున్నారన్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలలో వరంగల్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ముందంజలో ఉంటున్నారని పలు ఉదాహరణలు వివరించారు.శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండాలంటే సైన్స్ ప్రయోగాలను విద్యార్థి దశ నుండే చేయాలని, వివిధ రకాల పోటీలలో పాల్గొంటే పోటీ తత్వం అలవడుతుందని తెలిపారు.
వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీల్లో వరంగల్ జిల్లాలోని 13 మండలాల్లో మొదటి స్థానంలో పొందిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలో పాల్గొన్నారు. ఒక్కో గ్రూపులో 2-3 విద్యార్థులకు అనుమతి ఇచ్చారు.
జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో సెప్టెంబర్ మూడవ వారంలో పోటీలు నిర్వహించనున్నారని వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో బహుమతి పొందిన వారికి ఒక్కో అంశంలో ప్రథమ బహుమతి రూ.36 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.27 వేలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ కట్ల శ్రీనివాస్, శంభునిపేట ఉన్నత పాఠశాల హెచ్ఎం శారదాబాయి, జడ్జిలుగా నాగేశ్వరరావు, అనుపమ, రవికుమార్, సురేష్ బాబు, శ్రీనివాస్, తాటిపాముల రమేష్ తదితరులు పాల్గొన్నారు‌. జిల్లావ్యాప్తంగా 13 మండలాల నుండి మొదటి స్థానం పొందిన విద్యార్థులు, గైడ్ టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment