విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి కారకులైన ప్రిన్సిపల్ మరియు ఏఎన్ఎం ను సస్పెండ్ చేయాలి: ఎస్ ఎఫ్ ఐ
ముద్దిరాల కేజీబీవీ లో ఆరవ తరగతి చదువుతున్న గీతిక ఆత్మహత్యాయత్నానికి కారకులైన ఏఎన్ఎం వెంకటమ్మ , ప్రిన్సిపల్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనియాకుల శ్రీకాంత్ వర్మ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి లో విద్యార్థిని పరామర్శించి తల్లిదండ్రులతో మాట్లాడిన అనంతరం వారు మాట్లాడారు.గత కొన్ని రోజులుగా విద్యార్థిని గీతికను ఏఎన్ఎం నువ్వు క్లాస్ లీడర్ గా ఉండొద్దని తమ బంధువుల అమ్మాయి మాత్రమే ఉండాలని వేధిస్తుందని, టాబ్లెట్ల కోసం వెళ్ళినప్పుడు ఇవ్వకుండా చెంపల మీద గీతిక ను ఏఎన్ఎం వెంకటమ్మ కొట్టిందన్నారు. విద్యార్థిని తమ తండ్రికి చెప్పి ఏఎన్ఎంతో మాట్లాడించిన ప్రయోజనం లేదన్నారు. విద్యార్థిని తండ్రి మాట్లాడిన దగ్గర నుండి ఇంకా గీతికను టార్గెట్ చేసిందన్నారు. ఈ విషయంపై విద్యార్థిని గీతిక పలు మార్లు ప్రిన్సిపాల్ కి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందించలేదని వారు పేర్కొన్నారు. దీని ద్వారా మనస్థాపానికి చెందిన విద్యార్థిని పాఠశాల భవనంపై దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందన్నారు. శుక్రవారం ఉదయం విద్యార్థిని ఈ చర్యకు పాల్పడగా , ప్రిన్సిపల్ మరియు సిబ్బంది అసలు విషయాన్ని దాచి వాటర్ నల్లాకాడ విద్యార్థిని కాలు జారిపడిందని అబద్ధం చెప్పి ఏరియా ఆసుపత్రికి తరలించారు అన్నారు. తల్లిదండ్రులకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. కలెక్టర్ విద్యార్థినిని పరామర్శించడం సంతోషమని, కానీ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యార్థిని గీతికకు మెరుగైన చికిత్స అందించి భవిష్యత్తును కాపాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి బానోత్ వినోద్, అక్కినపల్లి వినయ్, సుమన్, మురళి, సుమల తదితరులు పాల్గొన్నారు.