జర్నలిస్ట్ సందీప్ మృతి మీడియా రంగానికి తీరని లోటు
సందీప్ సతీమణికి 65 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేసిన జర్నలిస్టులు
నాంపల్లి సందీప్ మృతి మీడియా రంగానికి తీరని లోటు అని జర్నలిస్ట్ యూనియన్ నాయకులు వజ్జే వీరయ్య, ఐయితబోయిన రాంబాబు గౌడ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాపోలు గుడి వద్ద సందీప్ నివాసానికి వెళ్లి ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ ను ఆయన సతీమణికి అందజేసి నివాళులర్పించి మాట్లాడారు.అతి చిన్న వయసులోనే నాంపల్లి సందీప్ అనారోగ్యంతో మరణించడం బాధాకరమని, ఇటీవల జర్నలిస్టు మిత్రుడు రమణ చనిపోతే ఆయన కుటుంబానికి జర్నలిస్టు మిత్రులు యూనియన్లకు అతీతంగా లక్ష రూపాయలు అందజేశామని, అదేవిధంగా సందీప్ కుటుంబానికి కూడా 65 వేల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్ అందజేశామని అన్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఏ జర్నలిస్ట్ మిత్రులకు ఆపద వస్తే ముందుండి ధైర్యంగా ఆదుకుంటామని తెలిపారు. జర్నలిస్టులకు ఆపద వచ్చినప్పుడు జర్నలిస్ట్ కుటుంబాలకు ఇతరులు కూడా సహకరించడం హర్షనీయమని అన్నారు. సందీప్ కుటుంబానికి ఆయన పిల్లలకు మీడియా అకాడమీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ను వచ్చే విధంగా కృషి చేస్తామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో పాల్వాయి జానయ్య, ఊట్కూరు రవీందర్,బత్తుల మల్లికార్జున్, రెబ్బ విజయ్, ఎరుకలు సైదులు గౌడ్, ఉయ్యాల నరసయ్య గౌడ్, గుడిపూరి రామకృష్ణ గౌడ్, వేల్పుల ప్రవీణ్, తండ నాగేందర్ గౌడ్, బచ్చు పురుషోత్తం,నాయిని రమేష్, తదితరులు పాల్గొన్నారు.