ప్రభుత్వం చర్చలు జరపాలి : టిపిటిఎఫ్
భద్రాచలం:సంవత్సరాల తరబడి గిరిజన విద్యారంగ అభివృద్ధి కోసం పని చేస్తూ తమ సమస్యలపై సమ్మె చేస్తున్న గిరిజన సంక్షేమ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి వారి సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టిపిటిఎఫ్) రాష్ట్ర కార్యదర్శి బుటారి రాజు ఉపాధ్యాయ దర్శిని సంపాదక వర్గ సభ్యుడు మునిగడప రామాచారి లు ప్రభుత్వాన్ని కోరారు. ఐటీడీఏ ముందు తమ సమస్యల పరిష్కారం కోరుతూ కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్స్ (సిఆర్టిలు) నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపి మాట్లాడుతూ. రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నప్పటికీ అతి తక్కువ వేతనంతో పని చేయవలసి వస్తుందని, జీతాల చెల్లింపులు కూడా ప్రతి నెల ఒకటవ తేదీన చెల్లించబడకపోవడం, రెగ్యులర్ ఉపాధ్యాయుల మాదిరిగా సెలవులు మహిళా సిఆర్టి లకు మెటర్నరీ సెలవులు మంజూరు చేయబడకపోవడం, చనిపోయిన సిఆర్టి ల కుటుంబాలకు ఆర్థికపరంగా కారుణ్య నియామకాల పరంగా ఎటువంటి భరోసా ఇవ్వలేకపోవడం, ఇతర డిపార్ట్మెంట్ల మాదిరిగా వీరికి పని చేస్తున్న టైం స్కేలు యొక్క మూలవేతనం చెల్లించబడకపోవడం లాంటి సమస్యలు ఉన్నతాధికారులు చర్చలకు పిలిచి పరిష్కరించకపోగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పేరుతో ప్రభుత్వం బెదిరించడం సరికాదని, రెగ్యులర్ ఉపాధ్యాయులు కూడా వీరి సమస్యలపై స్పందించి మద్దతు ఇవ్వవలసిన అవసరం ఉందని వారు అన్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ వీరికి కుటుంబ భారం పెరుగుతుండగా అందుకు అనుగుణ్యంగా వీరి వేతనాలు పెంచబడకపోవడం, కనీసం మూల వేతనాన్ని చెల్లించకపోవడం ప్రభుత్వానికి తగదని ఇప్పటికైనా వారితో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.