విజయ డైరీ వద్ద పాల రైతుల ఆందోళన
రేగోడ్ మండల కేంద్రంలోని విజయ డైరీ ఆధ్వర్యంలో నడిచే చిన్న తరహా పాల శీతలీకరణ కేంద్రం వద్ద పాల రైతులు శుక్రవారం ఆందోళన చేశారు. మూడు నెలలుగా పాలు డబ్బులు అకౌంట్లో జమ కావడం లేదని, స్థానిక అధికారులకు సైతం చెప్పిన పట్టించుకోవడంలేదని ఆ విధంగా వ్యక్తం చేశారు. గతంలోనూ చాలా సందర్భాల్లో కొందరు రైతులు తమ పాల డబ్బులు రాకపోవడంతో కేంద్రం చుట్టూ తిరిగి అలసిపోయి డబ్బులు అడగడం విరమించుకున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయ డైరీ పాల కేంద్రం నిర్వాహకులు సైతం డబ్బుల పంపిణీ విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని, నిర్వాహకులు పాల డబ్బుల కోసం తమ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారని పాడి రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు స్పందించి తమ పాల డబ్బులు సక్రమంగా అందే విధంగా సరైన వ్యవస్థ రూపొందించాలని, తక్షణమే తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరి రామకృష్ణయ్య, వెన్నెల సాయిలు, ఎక్కేల్లి శివకుమార్, సంగమేశ్వర్, ప్యారారం శివన్న, గొల్ల రాములు పాల్గొన్నారు.