సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరని లోటు..:సిపిఎం గార్ల,బయ్యారం మండలాలలో సంతాపం.

సీతారాం ఏచూరి మరణం పార్టీకి తీరని లోటు..:సిపిఎం గార్ల,బయ్యారం మండలాలలో సంతాపం.

బయ్యారం,గార్ల(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి మరణించడంపై ఆ పార్టీ గార్ల, బయ్యారం మండలాల మండల కమిటీలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి.

పార్టీ లో ఎస్ఎఫ్ఐ లో ప్రాథమిక సభ్యత్వం తీసుకొని విద్యార్థి లోకంలో అనేకమైన సమస్యలపై పోరాటాలు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి విద్యా రంగంలో చట్ట పరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారని, ఆ తర్వాత చదువుతోపాటు రాజకీయంగా ఆ పార్టీ యువజన సంఘం (డివైఎఫ్ఐ) లో రాష్ట్ర కార్యదర్శిగా సమాజంలో యువత పాత్రను ప్రభుత్వాలకు తెలియజేయడంలో కీలక భూమిక పోషించారని ఆ తరువాత అంచ లంచలుగా ఎదుగుతూ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా తదనంతరం పార్టీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారని కొనియాడారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మారుతున్న సమాజంలో ప్రజలకు దగ్గరగా అవినీతి,అక్రమాలు, కార్మిక సంఘాల హక్కులపై నిరంతర పోరాటాలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటాలకు పార్టీని ముందుండి నడిపించారని ఆ పార్టీ మండల కార్యదర్శి నంబూరి మధు, కందునూరి శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా సీతారాం ఏచూరి గురించి ఇరువురు మాట్లాడుతూ ఏచూరి ప్రస్తానాని తెలిపారు.

సీతారాం ఏచూరి మద్రాస్ (ప్రస్తుతం చెన్నై)లో తెలుగు కుటుంబంలో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌. తల్లి కల్పకం ఏచూరి ప్రభుత్వ అధికారి. వీరి మేనమామ మోహన్‌ కందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఏచూరి బాల్యం హైదరాబాద్‌లోనే గడిచింది. ఇక్కడి ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్‌లో 1970లో సీబీఎస్‌సీ హయ్యర్ సెకండరీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంకర్‌గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు.

జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా పొందారు. అక్కడే పీహెచ్‌డీలో చేరినా ఎమర్జెన్సీ సమయంలో అరెస్టు కావడంతో దాన్ని కొనసాగించ లేక పోయారు. సీతారాం జర్నలిస్టు సీమా చిశ్తీని వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. 

 -విద్యార్థి నేతగా రాజకీయాల్లోకి..

ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నేతగా 1974లో సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో జేఎన్‌యూ విద్యార్థిగా ఉన్నప్పుడు సీపీఐ(ఎం)లో చేరారు. జేఎన్‌యూ స్టూడెంట్స్ యూనియన్‌కు మూడుసార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. సీపీఐ(ఎం) మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కరాత్‌తో కలిసి జేఎన్‌యూను వామపక్ష కోటగా మార్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు.1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీలోకి వెళ్లిన ఆయన 1992లో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2005లో పశ్చిమ బెంగాల్ నుంచి తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన 21వ సీపీఐ(ఎం) మహాసభల్లో పార్టీ ఐదో ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2018 హైదరాబాద్ మహాసభలోనూ, 2021 కోజికోడ్ మహాసభలోనూ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు.

 -ప్రజాసమస్యలపై గళం.

ప్రజాసమస్యలు, ఇతర అంశాలపై గళం విప్పుతూ.. ఎగువ సభలో సీతారాం ఏచూరి గుర్తింపు పొందారు.

1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం ‘కామన్ మినిమమ్ ప్రోగ్రామ్’ ముసాయిదాను రూపొందించడంలో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరంతోపాటు ఏచూరి కీలక పాత్ర పోషించారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ఏచూరిది ముఖ్య భూమిక. రచయితగానూ మంచి గుర్తింపు ఉంది. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరిట ఓ ఆంగ్లపత్రికకు కాలమ్స్‌ రాశారు. ‘క్యాస్ట్‌ అండ్‌ క్లాస్‌ ఇన్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌ టుడే’, ‘సోషలిజం ఇన్‌ ఛేంజింగ్‌ వరల్డ్‌’, ‘మోదీ గవర్నమెంట్‌: న్యూ సర్జ్‌ ఆఫ్‌ కమ్యూనలిజం’, ‘కమ్యూనలిజం వర్సెస్‌ సెక్యులరిజం’ వంటి పుస్తకాలు రాశారు. ఆ పార్టీ ఆధికారిక పత్రిక పీపుల్స్ డెమోక్రసీ పత్రికకు సుధీర్ఘకాలం సంపాదకులుగా పనిచేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment