సహకారమా..? వ్యాపారమా..?

సహకారమా..? వ్యాపారమా..?

కొత్తపల్లి సొసైటీలో ఆగని ధరల దోపిడీ
ఇప్పటికే సొసైటీకి షోకాజ్ నోటీసులు
పేరుకు పెద్ద సొసైటీ , రైతుల జేబులు లూటీ
రైతులను తప్పుదారి పట్టిస్తున్న సొసైటీ చైర్మన్

పాపన్నపేట, చార్మినార్ ఎక్స్ప్రెప్రెస్ ఆగస్టు 25 :న్యూస్ : రైతులకు సహకారం చేయాలన్న సదుద్దేశంతో నెలకొల్పబడిన రైతు సహకార సంఘాలు అక్కడక్కడ వ్యాపార కేంద్రాలుగా మారాయి. నిజానికి వ్యవస్థ నుంచి రైతులు లాభపడాలి గాని వ్యవస్థ లాభపడుతూ రైతులు నష్టపోకూడదు. నిరంతరం రైతుల శ్రేయస్సు కోసం పనిచేయాల్సిన సంఘాలు అక్కడక్కడ రైతులకు నష్టం కలిగిస్తూ కొంతమంది బిజినెస్ బ్రోకర్లకు నీడనిస్తున్నాయని చెప్పవచ్చు.

తాజాగా మెదక్ జిల్లాలోని అత్యంత పెద్ద సొసైటీ దాదాపు మూడువేల పై చిలుకు సభ్యులు గల కొత్తపల్లి రైతు సేవా సహకార సంఘంలో యూరియా ను ఎమ్మార్పీ ధరకు కాకుండా కొత్తగా “మార్కెట్ ధర” అంటూ రూ. 13 అదనంగా వసూలు చేస్తూ రైతులను బోల్తా కొట్టిస్తున్నారు. ఇదే విషయమై పక్షం రోజుల క్రిందట “మనం” లో కథనం వెలువడగా స్పందించిన వ్యవసాయ అధికారులు సొసైటీకి షోకాజ్ నోటీసులు అందజేశారు. షోకాజ్ నోటీసులు ఇచ్చి 15 రోజులు దాటినా ధరల దోపిడీ ఆగడం లేదు. వ్యవసాయ అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వ్యవసాయ అధికారులు షోకాజ్ నోటీసులు ఇవ్వడం పై స్పందించిన సొసైటీ చైర్మన్ రమేష్ గుప్త అధిక ధరల వసూళ్లపై వ్యవసాయ అధికారులకు సంబంధం లేదని చెప్పడం హాస్యాస్పదం. నిజానికి ఎరువుల దుకాణానికి లైసెన్స్ ఇచ్చేదే వ్యవసాయ శాఖ అధికారులు.

*రైతులను తప్పుదారి పట్టిస్తున్న సొసైటీ చైర్మన్ :*

యూరియా పై రూ. 13 అదనంగా వసూలు చేస్తున్నారని “మనం” దినపత్రికలో కథనం వెలువడిన వెంటనే వ్యవసాయ శాఖ అధికారులు సొసైటీకి షోకాస్ నోటీసులు ఇచ్చారు. అదే రోజు కొత్తపల్లి సొసైటీ చైర్మన్ త్యార్ల రమేష్ గుప్తా ఒక ప్రకటనలో…. రైతుల సమ్మతితోనే సొసైటీ ఆధ్వర్యంలో ఎమ్మార్పీ కంటే రూ. 13 అదనంగా తీసుకుంటున్నామని బహిరంగంగానే వెల్లడించడం విమర్శలకు దారితీసింది. అధిక ధరలకు రైతుల సమ్మతి ఎలా ఉంటుందంటూ పలువురు ప్రశ్నిస్తున్నరు. పాలక మండలి ఒకవేళ తీర్మానం చేసినా ఎమ్మార్పీ నిబంధనలకు విరుద్ధంగా సదరు తీర్మానాలను అధికారులు తిరస్కరిస్తారు. యూరియాను ఎమ్మార్పీ కంటే రూ. 13 అదనంగా తీసుకుంటున్నామని చెబుతూనే మార్కెట్ ధరల ప్రకారం అని రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. 45 కిలోల యూరియా బస్తా పై దాదాపు పది నుంచి పదిహేను రూపాయలు డీలర్ మార్జిన్ వస్తున్నా, ట్రాన్స్పోర్ట్ చార్జీలు ప్రభుత్వమే భరిస్తున్నా రూ. 13 అదనంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 13 రూపాయలే కాకుండా ప్రైవేట్ హమాలీ వ్యక్తులకు బస్తాకు ఐదు రూపాయల చొప్పున చెల్లిస్తే ఒక బస్తాకు రూ.285 రూపాయలు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం పాటుపడాల్సిన చైర్మన్ రైతుల సమ్మతితోనే ఇలా అధికంగా వసూలు చేస్తున్నామని చెప్పడం బాధాకరమన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు, రైస్ మిల్లుల వద్ద షాట్ పేరిట జరిగే దోపిడి విషయంలో కూడా రైతుల సమ్మతిని పరిగణనలోకి తీసుకోవాలని రైతులు గుర్తు చేస్తున్నారు. సొసైటీలో ఇంత జరుగుతున్న రైతుల పాలిట నిలవాల్సింది పోయి వ్యాపారం వ్యాపారస్తులు వైపు మొగ్గుచూపుతున్నారని చైర్మన్ పై కొందరు ఆరోపణలు చేస్తున్నారు. రైతులకు వ్యతిరేకంగా ప్రకటన విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. సొసైటీ పైన చైర్మన్ కు పూర్తి అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారా? లేదా కావాలనే రైతులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారా? అని చర్చించుకుంటున్నారు. ఏదేమైనా మార్కెట్ ధరలు అని కాకుండా ఎమ్మార్పీ ధరలకే పక్కనే ఉన్న సొసైటీల మాదిరిగా యూరియా అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని సొసైటీ చైర్మన్ ను రైతులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment