స్వగ్రామానికి మావోయిస్టు అగ్రనేత ఏసోబు మృతదేహం.:టేకులగూడెంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు.
-నివాళులర్పించిన మాజీ మావోయిస్టులు, బంధు మిత్రులు.
వరంగల్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
దంతెవాడలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు అగ్రనేత ఏసోబు మృతదేహాం స్వస్థలం టేకులగూడెంకు గురువారం ఉదయం చేరుకుంది. మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఏసోబు మరణించినట్లుగా బుధవారం దతెవాడ ఎస్పీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈమేరకు చత్తీస్గడ్ పోలీసులు గురువారం ఉదయం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెంలోని ఏసోబు స్వగృహానికి మృతదేహాన్ని చేర్చారు. ఏసోబుకు పలువురు మాజీ మావోయిస్టులు, మావోయిస్టుల కుటుంబాల సభ్యులు, బంధుమిత్రుల సంఘం నేతలు నివాళి అర్పించారు. గురువారం సాయంత్రం వరకు అంత్యక్రియలు పూర్తి చేసేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు పార్టీ తొలితరం నేతల్లో ఒకరిగా ఉన్న మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ అలియాస్ రణదేవ్ దాదా కేంద్ర మిలిటరీ కమిటీ సభ్యుడిగా, మహారాష్ట్ర చత్తీస్గడ్ బార్డర్ ఇంచార్జ్‌గా కొనసాగుతున్నారు. 1980లో మావోయిస్టు ఉద్యమంలో చేరిన ఆయన అంచలంచెలుగా కేంద్ర పార్టీలో కీలక స్థాయికి చేరుకున్నారు.