బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. కీలక నేత జంప్..!
తెలంగాణలో రాజకీయంగా మరో కీలక పరిణామం చోటు చేసుకోనుందా.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారా.. అధికార కాంగ్రెస్ కాకుండా బీజేపీలో చేరనున్నారా.. కరీంనగర్ పొలిటికల్ అడ్డాలో ఏం జరుగుతోంది.. కీలక వివరాలు …
తెలంగాణలో వలసల పర్వం మళ్లీ మొదలైందా.. చాలా కాలం గ్యాప్ తరువాత నేతల జంపింగ్స్ మళ్లీ మొదలవనున్నాయా.. అంటే పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. అయితే, ఇక్కడో ట్విస్ట్ ఉందండోయ్.. నిన్న మొన్నటి వరకు పలువురు నేతలు బీఆర్ఎస్, బీజేపీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఇప్పుడు రూట్ మ్యాప్ మారింది. అధికారి పార్టీలో కాకుండా.. బీజేపీ వైపు ఇంట్రస్ట్ చూపుతున్నారు. కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగలనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పట్టణానికి చెందిన కీలక నేత సహా మరో 10 మంది బీఆర్ఎస్‌ను వీడి.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. ఇందుకోసం ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నారట. మరి బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లే ఆ కీలక నేతలు ఎవరు.. కరీంనగర్ లో అసలేం జరుగుతోంది..
2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలవడం, కాంగ్రెస్ విజయం సాధించడం జరిగిపోయాయి. మెజార్టీ మార్క్ కంటే ఒకటి రెండు ఎమ్మెల్యే సీట్లు మాత్రమే ఎక్కువ గెలిచిన కాంగ్రెస్.. తన ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలంటే ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు గాలం వేయక తప్పలేదు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఎమ్మెల్యేలే కాదు.. బీఆర్ఎస్ చాలా మంది ముఖ్య నాయకులు సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత ఈ కప్పదాట్లకు కాస్త బ్రేక్ పడింది. బీఆర్ఎస్ మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీ అగ్ర నాయకులు, క్షేత్ర స్థాయి నాయకులు సైతం ఆయా కార్యక్రమాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్నారు. ఈ ఉత్సాహంతోనే నెక్ట్స్ ప్రభుత్వం మాదేనంటూ బీఆర్ఎస్ నాయకులు ప్రకటనలు కూడా ఇచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కరీంనగర్ అడ్డాగా బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగనుందనే ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, కరీంనగర్ మేయర్ సునీల్ రావు.. బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారట. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యిందట. మేయర్ సునీల్ రావుతో పాటు.. కరీంనగర్‌కు చెందిన పది మంది కార్పొరేటర్లు సైతం బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం నాడు మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరుతారని కరీంనగర్ పొలిటికల్ అడ్డాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదే గనుక జరిగితే.. కరీంనగర్ గడ్డ మా అడ్డా అని చెబుతున్న బీఆర్ఎస్ శ్రేణులకు గట్టి దెబ్బ తగిలినట్లే అవుతుంది.