ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల ఫీజుల నియంత్రణ కోసం సిద్ధమైన ముసాయిదా బిల్లు
డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి సమర్పించిన ఆకునూరి మురళి
ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటుకు విద్యా కమిషన్ సిఫార్సు
ఇంజినీరింగ్ కాలేజీల మాదిరి మూడేళ్లకోసారి పెంపు ఉండాలని సూచన
తెలంగాణలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణపై ముసాయిదా బిల్లు సిద్ధమైంది. ఈ మేరకు డ్రాఫ్ట్‌ను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఫీజుల నియంత్రణ కమిషన్ ఏర్పాటుకు విద్యా కమిషన్ సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది.ప్రైవేటు స్కూల్స్, కాలేజీల్లో ఫీజులు పెనుభారంగా మారాయని ఎంతోమంది తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. స్కూల్, కాలేజీ యాజమాన్యాలు ఫీజులను కూడా ప్రతి సంవత్సరం పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఫీజుల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లు తయారీ బాధ్యతను విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి అప్పగించింది.
ఇంజినీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సులకు టీఏఎఫ్ఆర్సీ ఉన్నట్లుగానే రాష్ట్రంలోని ప్రవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్రస్థాయిలో ఒక కమిటీని నియమించాలని, దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి చైర్మన్‌గా ఉండేలా సిఫార్సు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్‌కు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం జాయింట్ సెక్రటరీ వెంకట్, ఇతర ప్రతినిధులు ఇటీవల కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళిని కలిసి వినతి పత్రం అందించారు.ప్రతి ఏడాది ఫీజులు పెంచడం కాకుండా ఇంజినీరింగ్ కాలేజీల మాదిరి మూడోళ్లకోసారి ఆడిట్ నివేదికలను పరిశీలించి పెంపును నిర్ణయించాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ విభాగం ఉండాలన్నారు