హైడ్రా అంటే హడలెత్తుతున్న హైదరాబాదీలు అమ్మేవాళ్లే కానీ కొనేవాడు లేడు.
-హైడ్రా ఎన్వోసీ ఉంటేనే రుణాలిస్తామంటున్న బ్యాంకులు.
హైదరాబాద్(చార్మినార్ ఎక్స్ ప్రెస్)
భూ యజమానులు బిల్డర్లకు ఇచ్చారు.. బిల్డర్లు అమ్ముకున్నారు
నివాసం ఉంటున్నది మధ్యతరగతి వేతన జీవులే
కూల్చివేతలతో నష్టపోతున్నది సామాన్యులే
ముంబాయి రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరుగులు. ఒకేసారి ఆపరేషన్ మొదలు పెట్టడంతో నగర జీవులు అల్లాడిపోతున్నారు. వాస్తవంగా హైదరాబాద్‌లో చెరువులు, నాలాలను చెరబట్టటంతోనే చిన్న వర్షానికే భారీ వదరలు వస్తున్నాయి. కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. నగరం నడిమధ్యలో హైటెక్ సిటీకి ఆనుకొని ఉన్న దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే అనేక బహుళ అంతస్థుల భవనాలు పలు కాలనీలు వెలిశాయి. హైదరాబాద్ జంటనగరాల ప్రజల దాహార్తి తీరుస్తున్న గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలోనే అక్రమ నిర్మాణాలు పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చాయంటేనే కబ్జాదారులు తమకున్న రాజకీయ పలుకుబడితో ఎలా బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. సంఘంలో పెద్దమనుషులుగా చెలామణి అయ్యేవారు, ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా ఉన్న కొంత మంది ఈ అక్రమ నిర్మాణాల వెనుక ఉన్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
విధ్వంసం ఈనాటిది కాదు..
వ్యవస్థీకృతంగా జరిగిన చెరువుల ఆక్రమణలు, విధ్వంసం ఈనాటిది కాదు. దాదాపు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు అయినప్పటి నుంచీ మొదలైంది. రానురాను ఈ ఆక్రమణల పర్వం పరాకాష్టకు చేరింది. వింతల్లోకెల్లా వింత ఏమిటంటే.. సింగరేణి ఉద్యోగుల సొసైటీకి ఇండ్లు కట్టుకోవడానికి సరూర్ నగర్‌లో ప్రభుత్వం ఇచ్చిన స్థలమే సరూర్ నగర్ చెరువులో ఉంది. ఇందులో ఇండ్లు నిర్మించుకోవడానికి జీహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చింది. ఇందులో అపార్ట్‌మెంట్లు, వ్యక్తిగత ఇండ్ల నిర్మాణం జరిగింది. దాదాపు 20 ఏళ్లుగా సింగరేణి ఉద్యోగులు అక్కడ నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతం సరూర్‌నగర్ ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో ఉన్నదని ఇప్పటికి గానీ ప్రభుత్వానికి స్పృహరాలేదు. ఇలా అనేకచోట్ల చెరువుల ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో జరిగిన నిర్మాణాలకు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మున్సిపాలిటీలు నిర్మాణ అనుమతులు ఇవ్వడం గమనార్హం. నిర్మాణ అనుమతులు రావడంతో బిల్డర్లు నిర్మించారు. బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఉద్యోగులు, వ్యాపారస్థులు, ఇతర వేతన జీవులు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని అపార్ట్ మెంట్లు (apartments), ఇండ్లు కొనుక్కొని వాటిల్లో నివాసం ఉంటున్నారు. తాజాగా హైడ్రా వచ్చి ఈ భవనాలన్నీ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్నాయంటూ కూల్చి వేస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు విధులు ముగించుకొని ఇంటికి వచ్చే సరికి భవనాలు కూలిపోయి, శిథిలాలతో దర్శనమిస్తున్నాయి. దీంతో తాము బ్యాంకు రుణాలు తీసుకొని కొన్నామని, అన్ని అనుమతులు ఉన్నాయని చూసుకొని కొనుక్కున్నామని చెపితే వినే నాథుడే లేకుండా పోయాడని బాధితులు వాపోతున్నారు. అయితే ఎన్ని విమర్శలు వచ్చినా.. డోంట్ కేర్ అన్నట్టుగా హైడ్రా తీరు ఉన్నది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన చేసినా వెరవకుండా కూల్చివేతలు చేస్తున్నారు. తాజాగా అమీన్‌పూర్‌లో కూల్చివేతలు మొదలు పెట్టగానే అక్కడి మున్సిపల్ చైర్మన్ వచ్చిఅడ్డుకునే ప్రయత్నం చేసినా ఆపలేదు. ఇప్పటి వరకు 180కి పైగా నిర్మాణాలు కూల్చి వేశారని అంటున్నారు. ఇందులో గండిపేట జలాశయం అతి సమీపంలో ఉన్న 48 నిర్మాణాలను డిమాలిష్ చేసింది. ఈ పరిస్థితి ఎలా ఉందంటే… భూ యజమాని పట్టా భూమి కాబట్టి తన భూమిని డెవలప్‌మెంట్ నిమిత్తం బిల్డర్‌కు ఇచ్చాడు. అన్ని పత్రాలు చూసుకొనే అంతా సరిగ్గా ఉందని నిర్థారించుకున్న తరువాతనే అగ్రిమెంట్ చేసుకొని డెవలప్ చేశానని బిల్డర్ చెపుతున్నాడు. అన్ని అనుమతులు చూసుకున్నాకే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని కొనుక్కున్నామని ఇంటి యజమాని చెపుతున్నాడు. ఇక్కడ తప్పెవరిది? భూ యజమానిదా? లేక బిల్డర్‌దా? లేదా ఎఫ్‌టీఎల్ అని తెలిసి కూడా అనుమతులు ఇచ్చినా హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలదా? ఎవరు దీనికి బాధ్యత వహించాలి? కానీ చివరకు భూ యజమాని, బిల్డర్, అనుమతులు ఇచ్చిన అధికారులు అంతా బాగానే ఉన్నారు. అప్పు చేసి కొనుగోలు చేసిన ఇంటి యజమాని తీవ్రంగా నష్టపోయాడని సగటు హైదరాబాద్ వాసి అంటున్నాడు