ఆ రైల్వే స్టేషన్ అభివృద్దికి రూ.271 కోట్ల నిధులు
2027లో గోదావరి పుష్కరాలు
పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేసిన కేంద్రం
తొలుత అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులకు టెండర్లు
రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.271 కోట్ల నిధులు మంజూరు చేసింది. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను మంజూరు చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని రాజమండ్రి రైల్వే స్టేషన్ అత్యంత ప్రధానమైనది. ఈ స్టేషన్ నుంచి నిత్యం వేలాది మంది ప్రయాణికులు విశాఖ, కాకినాడ, భీమవరం వైపు రాకపోకలు సాగిస్తుంటారు.
ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తున్నారన్న అంచనాతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయగా, అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద కేంద్ర ప్రభుత్వం తొలుత రూ.250 కోట్ల పనులకు టెండర్లు పిలిచింది. అయితే పుష్కరాల ప్రతిపాదనలతో వీటిని రద్దు చేసిన కేంద్రం కొత్త నిధులను మంజూరు చేసింది.
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రాజమండ్రి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి హంగులతో తీర్చిదిద్దాలని గతంలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఆ క్రమంలోనే అమృత భారత్ స్టేషన్ పథకం కింద రూ.250 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయితే పుష్కరాల నేపథ్యంలో తాజా ప్రతిపాదనలతో మరో 21 కోట్లు అదనంగా మంజూరు చేయడం జరిగింది